ఒక హృదయం ధ్వనించే రాగం
ఇరు చరణముల పయనం
నాలుగు దిశల సమాహారం
పంచభూతములు సహగమనం
షడ్ రుచుల సమ్మేళనమే ఈ ఉగాది..!
ఒక యుగానికి ఆది..!!
ఫాల్గుణ మాసాన .,
ముత్యాలు పొదిగిన చీరలా వేప వృక్షం
అమృతం నింపిన గళంలా కోయిల గానంతో
పరవశిస్తుంది ప్రకృతి పల్లె వెలుగులో..!
ముత్యాలు పొదిగిన చీరలా వేప వృక్షం
అమృతం నింపిన గళంలా కోయిల గానం ఏవని
ప్రపంచాన్ని ప్రశ్నిస్తుంది ప్రకృతి
నగరాల కారు నిశిలో.,
నాగరిక పరిభాషలో..!
నాగరికత పేరున ఆధునిక అభివృద్ధి ఆనంద సోపానమే! ఆహ్వాన నీయమే !!
అభివృద్ధి పేరున సంస్కృతి విస్మరణ చేర్చేది ఏ గమ్యమో అనుమానాస్పదమే !!
నూతన ధోరణి ప్రవాహ వేగంలో
సనాతన సంప్రదాయo కొట్టుకుపోతున్న స్థితి!
ఆర్ధికంగా ఎదగాలని కుతూహలంతో
నైతిక విలువలను కప్పివేస్తున్న పరిస్థితి!!
తెలుగు భాష కు దూరంగా బ్రతుకుతున్నారు !
సాహిత్యం అను ఊసే ఎరుగరు వీరు!!
ఆధునిక అభివృద్ధి కావాలి
అధునాతన సంస్కృతి మెరవాలి!
జాడ మారినా,
జానపదం స్థిరంగా మెలగాలి.!!
వివిధ భాషల ప్రావీణ్యం కావాలి
మాతృ భాష ప్రాముఖ్యం నిలవాలి
భౌతికంగానే కాదు
నైతికంగాను ఎదగాలి!
నూతన ఉషస్సు ఆగమనముతో సమాజమును వీక్షించిన నా హృదయం చేసే మూగబాస ..!!
ఆపాదమస్తకం ఆవరించివున్న ప్రాణం లో ఇమిడి ఉన్నది మనసనీ
ఆ పాదములు ఆకాంక్షిస్తున్నాను ప్రయాణం లో నిండి ఉన్నది సాహిత్యమనీ
ఆ పడ సీమల అలంకారము న ఉన్నది స్వరాల సాంగత్యమనీ
ఆ పద సంపద అలల కళన దాగి ఉన్నది జీవన నృత్యమనీ
కళల సీమలో సాహితీ తారనై ప్రకాశించాలని ....
మూగబోయిన నా గళంతో
వేయి యువ గళములు సమ్మేళనమై
సుమనోహర మార్పును
రేపటి తరాలకు అందివ్వాలని
నా ఆశ...!!
- దాసు రమ శ్రీ వినీల
Comments
Post a Comment